Tuesday, July 21, 2009

రోజురోజుకూ ముదురుతున్న వరి విత్తనాల గొడవ
వైరా
వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఈ ఖరీఫ్‌ కోసం రైతులకు అమ్మిన బిపిటి 5204 పౌండేషన్‌ వరి విత్తనం మొలకెత్తక రైతులు లబోదిబోమంటున్నారు. ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థ అయిన వైరా కృషి విజ్ఞాన కేంద్రం వరి పరిశోధనా కేంద్రంలో పండించిన పౌండేషన్‌ సీడ్‌ను 30 కేజీలు రూ.585లకు విక్రయించారు. జిల్లా వ్యాపితంగా వరి విత్తనం కోసం తరలివచ్చిన వందల మంది రైతులకు ఒక్కొక్కరికి 30 కేజీల బస్తా ఒక్కొక్కటి విక్రయించారు. పౌండేషన్‌ సీడని, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పండించి తయారు చేసిన విత్తనం మేలైందని నమ్మిన రైతులు విత్తనం కోసం ఎగబడ్డారు. రైతుల ఒత్తిడి పెరిగిపోవడంతో వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పోలీసుల బందోబస్తు మధ్య సుమారు 90 క్వింటాల విత్తనాలను విక్రయించారు. ఈ విత్తనం చల్లిన రైతులు మొలకెత్తలేదని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను కలవగా వాతావరణాన్ని చూసుకుని విత్తనం చల్లాలని, ప్రస్తుతం తాము చల్లి పెంచుతున్న నారుమళ్లను పరిశీలించి రాండని ఉచిత సలహాలిస్తున్నారు. బ్రాహ్మణపల్లి, సోమవరం, స్టేజి పినపాక, గన్నవరం, ఖానాపురం, విప్పలమడక రైతులు కృషి విజ్ఞాన కేంద్రానికిరాగా అధికారుల నుండి సరైన సమాధానం లేదు. వరికోత సమయంలో ఆలస్యమై బాగా తూలిపోయి, గింజ పునరుత్పత్తి శక్తిని కోల్పోయిందని, విత్తన శుద్ధి కూడా జరగలేదని రైతులు విమర్శిస్తున్నారు. గట్టిగా నిలదీసిన రైతులకు జెజిఎల్‌ రకం విత్తనం అందజేసి కళ్లనీళ్లు తుడుస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments: